నేనెంత
నాన్నగారు పరీక్షల్లో ఒక ప్రశ్నలో కథ వ్రాయమంటే పద్యాలలో వ్రాస్తే గొప్పగా ఉంటుందని మొత్తం పద్యాలు వ్రాశారట. బోలెడు మార్కులు వస్తాయని ఆశ తో ఎదురుచూస్తుంటే,'కద వ్రాయమంటే పద్యాలలో ఎందుకు వ్రాసావు అని ఎర్రసిరాతో సున్నాపెట్టాడట. అది చూసి నాన్నగారు చాలా నిరాశ చెందారు. బందరు లో ముట్నూరి కృష్ణా రావు గారి సంపాదకత్వం తో కృష్ణాపత్రిక వారపత్రిక వచ్ఛేది. [...]